భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెంలో ప్రసవ సమయంలో అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డలు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 13న చాట్ల వనజ అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సే కాన్పు చేయగా, వనజ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడం, శిశువు పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ ఇల్లెందు ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తల్లీబిడ్డలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన రోజే గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా, తాజాగా కర్మకాండల్లో భాగంగా వనజను దహనం చేసిన చోట చితాభస్మాన్ని సేకరిస్తుండగా శస్త్రచికిత్సకు ఉపయోగించే 'కత్తెర' బయటపడటం సంచలనంగా మారింది. స్టాఫ్ నర్సు ప్రసవం చేసే సమయంలో చూపిన తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, తల్లీబిడ్డల మరణానికి ఈ కత్తెరే సాక్ష్యమని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. గుండాల ప్రభుత్వ వైద్యశాలలో వనజకు కేవలం సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) మాత్రమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయలేదని స్పష్టం చేశారు. మరి దహనం చేసిన ప్రదేశంలో ఆ కత్తెర ఎలా వచ్చిందనే విషయంపై తమకు ఎలాంటి అవగాహన లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు.