ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన సీజన్‌గా 2026 నిలిచింది. ఈ ఏడాది టీవీ, డిజిటల్ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించినట్లు టోర్నీ అధికారిక ప్రసారకర్త ‘జియో హాట్‌స్టార్’ ప్రకటించింది. గత ఏడాది వ్యూయర్షిప్తో పోలిస్తే ఇది 7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్‌ను గెలుచుకున్న ఈ ఉత్కంఠభరిత పోరాటాన్ని వేర్వేరు స్క్రీన్లపై కలిపి రికార్డు స్థాయిలో 40 కోట్ల మంది వీక్షించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక మ్యాచ్‌కు ఈ స్థాయిలో వ్యూయర్షిప్ రావడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టీవీల్లో 22 శాతం, డిజిటల్లో 8 శాతం ప్రేక్షకుల సంఖ్య పెరగ్గా.. జియో హాట్‌స్టార్ ప్రాంతీయ డిజిటల్ ఛానెల్స్‌లో వ్యూయర్షిప్ ఏకంగా 33 శాతం పెరిగింది. ఈ తాజా రేటింగ్‌లు అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఐపీఎల్ స్థాయిని మరోసారి నిరూపించాయని, భవిష్యత్తులో మరిన్ని కొత్త హంగులు, అధునాతన టెక్నాలజీతో ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తామని జియో స్టార్ సీఈఓ ఇషాన్ ఛటర్జీ పేర్కొన్నారు